Crispy Dosa : హోట‌ల్ స్టైల్‌లో క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా దోశ‌.. ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Crispy Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం ఉద‌యం పూట త‌యారు చేసే వాటిల్లో దోశ కూడా ఒక‌టి. ఈ దోశ‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా దోశ‌ను క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. బ‌య‌ట హోట‌ల్స్ లో దొరికే విధంగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Crispy Dosa make in this method
Crispy Dosa

హోట‌ల్ స్టైల్ దోశ‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప ప‌ప్పు – ఒక క‌ప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, శ‌న‌గ ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, బియ్యం – రెండున్న‌ర క‌ప్పులు, అటుకులు – అర క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌.

హోట‌ల్ స్టైల్ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మిన‌ప ప‌ప్పును, మెంతుల‌ను, శ‌న‌గ ప‌ప్పును వేసి శుభ్రంగా క‌డగాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి 4 నుండి 6 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. అదే విధంగా అటుకుల‌ను కూడా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి అర గంట నుండి గంట పాటు నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న త‌రువాత వీట‌న్నింటినీ విడివిడిగా లేదా క‌లిపి మిక్సీ లో లేదా గ్రైండ‌ర్ లో వేసి రెండున్న‌ర క‌ప్పుల వ‌ర‌కు నీళ్లు పోసుకుంటూ మిక్సీ ప‌ట్టుకుని పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత పిండి గిన్నె పై మూత ఉంచి 8 గంట‌ల పాటు పులియ‌బెట్టాలి. పిండి పులిసిన త‌రువాత ఒకసారి బాగా క‌లపాలి. త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని దానిలో రుచికి త‌గిన‌ట్టుగా ఉప్పును వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి. ఈ దోశ‌పై నూనె వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హోట‌ల్ స్టైల్ దోశ తయార‌వుతుంది. దీనిని పల్లి, కొబ్బ‌రి, ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts