Dahi Puri : మనకు బయట చాట్ బండార్ లల్లో లభించే చిరుతిళ్లల్లో దహీ పూరీ ఒకటి. దహీ పూరీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బయట లభించే విధంగా అదే రుచితో ఈ దహీ పూరీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, తేలికగా దహీ పూరీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాట తరుగు – కొద్దిగా, ఉల్లిపాయ తరుగు – కొద్దిగా, నైలాన్ సేవ్ – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, మైదాపిండి – 1/3 కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్వీట్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, చింతపండు రసం – 300 ఎమ్ ఎల్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ముప్పావు టీ స్పూన్, నల్ల ఉప్పు – తగినంత, పంచదార – పావు కిలో.
గ్రీన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా తరుగు – ఒక కట్ట, పుదీనా తరుగు – ఒక కట్ట, నిమ్మకాయ – 1, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 4.
ఆలూ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నల్ల ఉప్పు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
దహీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చల్లటి పెరుగు – 300 ఎమ్ ఎల్, పంచదార – పావు కప్పు.
దహీ పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, మైదాపిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిని పలుచటి చపాతీలా వత్తుకోవాలి. తరువాత కట్టర్ తో లేదా కప్పుతో పూరీలా ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వాటిపై తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీలను వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీ తయారవుతుంది. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, ధనియాలు, సోంపు గింజలు వేసి వేయించాలి.
తరువాత చింతపండు రసం, జీలకర్ర, కారం, నల్ల ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత దీనిని గులాబ్ జామున్ పాకంలా చిక్కగా అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వీట్ చట్నీ తయారవుతుంది. ఇప్పుడు ఒక జార్ లో పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల గ్రీన్ చట్నీ తయారవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత తరువాత అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పక్కకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆలూ మసాలా తయారవుతుంది.
ఇప్పుడు పెరుగులో పంచదార వేసి పంచదార కరిగే వరకు కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు పూరీని తీసుకుని రంధ్రాన్ని చేయాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ ఆలూ మసాలాను వేయాలి. తరువాత టమాట తరుగు, ఉల్లిపాయ తరుగు వేయాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ పెరుగు, పావు టీ స్పూన్ స్వీట్ చట్నీ, పావు టీ స్పూన్ గ్రీన్ చట్నీ వేసుకోవాలి. తరువాత వాటిపై కొత్తిమీర తరుగు, నైలాన్ సేవ్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ పూరీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే దహీ పూరీని తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.