Dhaniyala Pulusu : మనం ధనియాలను పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. ధనియాల పొడి వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దాదాపు వంటింట్లో మనం చేసే ప్రతి వంటలోనూ ధనియాలను ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటాము. వంటల్లో వాడే ఈ ధనియాలతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ధనియాల పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ధనియాల కూరను తయారు చేసుకుని తినవచ్చు. అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ కూరను తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ ధనియాల పులుసు కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనియాల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2, ధనియాల పొడి – 3 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, తరిగిన టమాటాలు -2, నూనె- ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం -ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3.
ధనియాల పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కారం, ఉప్పు వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు ఉడికించిన తరువాత చింతపండు పులుసు, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధనియాల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ధనియాల పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.