Instant Gongura Rice : గోంగూర‌తో ఒక్క‌సారి ఇలా చేసి పెడితే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Instant Gongura Rice : మ‌నం గోంగూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గోంగూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముకల‌ను దృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. గోంగూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోంగూర రైస్ కూడా ఒక‌టి. ఈ రైస్ పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల‌ల్లోకి కూడా ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. గోంగూర రైస్ అన‌గానే చాలా మంది శ్ర‌మ‌తో కూడిన ప‌ని అని భావిస్తారు. కానీ చాలా సుల‌భంగా 10 నిమిషాల్లోనే ఈ రైస్ ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ గోంగూర రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర రైస్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

అన్నం – పావు కిలో బియ్యంతో వండినంత‌, గోంగూర – 2 గుప్పెళ్లు, నెయ్యి – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీఆకులు – 2, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, సాజీరా – అర‌ టీ స్పూన్, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు -త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్,కారం – 2 టీ స్పూన్స్, గ‌రం మ‌సాలా -అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్.

Instant Gongura Rice recipe in telugu very tasty lunch
Instant Gongura Rice

గోంగూర రైస్ త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో గోంగూర వేసి మూత పెట్టి మ‌గ్గించాలి. త‌రువాత ఈ గోంగూర‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, కొత్తిమీర‌, పుదీనా వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్కలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న గోంగూర వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత అన్నం వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర రైస్ త‌యార‌వుతుంది. ఈ విధంగా రుచిగా, క‌మ్మ‌గా అప్ప‌టిక‌ప్పుడు గోంగూర రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts