Boorugu Mokka : అటవీ ప్రాంతాలలో, బీడు భూముల్లో కొన్ని రకాల పూల మొక్కలు వాటంతట అవే పెరిగి పూలు పూస్తూ ఉంటాయి. వీటిని ప్రకృతే సహజసిద్ధంగా పెంచుతుందని చెప్పవచ్చు. ఇలా సహజసిద్ధంగా పూలు పూసే మొక్కల్లో బూరుగు పూల మొక్క కూడా ఒకటి. ఈ పూలను, ఈ చెట్టును చూడని వారు ఉండనే ఉండరు అని చెప్పవచ్చు. ఈ బూరుగు పూలను బతుకమ్మ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలు కూడా మనకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే ఎక్కువగా దొరుకుతాయి. కేవలం పూలను ఇవ్వడమే కాకుండా బూరుగ పూల మొక్క మనకు ఔషధంగానూ ఉపయోగపడుతుంది.
బూరుగు పూలల్లో నల్లని చిన్న గింజలు ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తారు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ బూరుగు మొక్క గింజలు, ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. బూరుగు పూల మొక్క వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బూరుగు మొక్క గింజలను సేకరించి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి కలుపుకోవాలి. ఇందులోనే తగినంత పటిక బెల్లం పొడిని కూడా కలుపుకోవాలి. ఈ నీటిని రోజూ తాగుతూ ఉండడం వల్ల మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి.
చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య ఉన్న వారు బూరుగు మొక్క ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. అంతేకాకుండా మోకాళ్ల నొప్పులను తగ్గించడంలోనూ బూరుగు మొక్క మనకు ఉపయోగపడుతుంది. బూరుగు మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే నొప్పులు తగ్గుతాయి. అలాగే గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా బూరుగు మొక్క ఆకులు మనకు ఉపయోగపడతాయి. ఈ ఆకులను పేస్ట్ గా నూరి, అందులో పసుపును కలిపి చర్మంపై రాసుకోవడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా బూరుగు మొక్క మనకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.