House : మనందరం డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. డబ్బు సంసాదించడానికి మనం చేయని పని అంటూ ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చైపోతుంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోవడమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం. దీనివల్ల మనశ్శాంతి కొరవడి ఇంట్లో గొడవలు పడడం, వ్యాపారంలో నష్టం రావడం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. వీటిన్నింటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెబుతున్నారు. మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటి.. వాటిని ఎలా సరిచేసుకోవాలి.. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచడం వల్ల జేష్టా దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందట. రోలు, రోకలి, పొయ్యి, పడుకునే మంచం ఇవి అన్ని కూడా మంగళకరమైన వస్తువులే అని పెద్దలు చెబుతున్నారు. వీటి మీద కూర్చోవడం కానీ, కాలితో తన్నడం కానీ చేయవద్దు. పొయ్యి కూడా ఎంతో మంగళరమైన వస్తువు అని వారు చెబుతున్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి , ముగ్గు వేసిన తరువాతే పొయ్యిని వెలింగించేవారు. కానీ ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్ లను వాడుతున్నారు. గ్యాస్ స్టవ్ ను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి, బొట్టు పెట్టిన తరువాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తరువాతే స్టవ్ ను వెలిగించాలి.
అప్పుడప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండ అలాగే ఉంచుతారు. అలా అస్సలు ఉంచకూడదని దీని వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చై పోతుందట. వంట గదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
అలాగే పడుకునే మంచంపై కుంకుమ, పసుపు, వెండి, బంగారం వంటి వాటిని ఉంచరాదు. మంచంపై దుప్పటిని కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. చీపురును కూడా లక్ష్మీ దేవి ప్రతిరూపం అని పెద్దలు చెబుతుంటారు. చీపురును కూడా తన్నకూడదని, ఒకవేళ కాలు తగిలినా కూడా చీపురును కళ్లకు అద్దుకోవాలని, చీపురును ఎప్పుడూ ఈశాన్య మూలన కానీ, భోజన గదిలో కానీ, పూజ గదిలో కానీ పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. అసలు పూజ గదిని చీపురుతో శుభ్రం చేయకూడదని, ప్రత్యేక వస్త్రాన్ని ఉంచి దాంతో మాత్రమే శుభ్రం చేయాలని అంటున్నారు. మన ఇంట్లో ఉండే చీపురుకు దుష్ట శక్తిని ఆపే శక్తి ఉంటుంది. కనుక చీపురును ఎప్పుడూ ఊడ్చే వైపు కిందకు ఉండేలా పట్టుకునే వైపు పైకి ఉండేలా పెట్టాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు.