Dondakaya Ulli Karam : మనం దొండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దొండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దొండకాయ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లికారం వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన దొండకాయలు – 400 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, తరిగిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
దొండకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత జార్ లో వేయించిన ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి.
దొండకాయ ముక్కలు మగ్గిన తరువాత మూత తీసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. దొండకాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత ఉప్పు, పసుపు, మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి కలపాలి. ఈ ఉల్లికారాన్ని ఎర్రగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన వేపుడు నిల్వ కూడా ఉంటుంది. దొండకాయలను ఇష్టపడని వారు కూడా ఈ దొండకాయ ఉల్లికారాన్ని ఇష్టంగా తింటారు. దొండకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఉల్లికారం వేసి కూడా తయారు చేసుకుని తినవచ్చు.