Jonnalu Palakura Corn Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనం సాధారణంగా ఇడ్లీలను ఇడ్లీ రవ్వతో తయారు చేస్తూ ఉంటాము. అయితే ఇడ్లీ రవ్వకు బదులుగా మనం జొన్న రవ్వతో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే జొన్న పాలక్ కార్న్ ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడాచాలా సులభం. ఈ ఇడ్లీలను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ ఇడ్లీలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే జొన్న రవ్వతో జొన్న పాలక్ కార్న్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పాలక్ కార్న్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న రవ్వ – ఒకకప్పు, మినపప్పు – పావు కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్స్, పాలకూర – పావు కప్పు, స్వీట్ కార్న్ – ఒక టేబుల్ స్పూన్, పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత.
జొన్న పాలక్ కార్న్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా జొన్న రవ్వను శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పు, మెంతులను కలిపి శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత జార్ లో నానబెట్టిన మినపప్పు, జొన్న రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఇందులో పాలకూర, స్వీట్ కార్న్, బఠాణీ, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఈ పిండిని ఇడ్లీ ప్లేట్ లలో వేసుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో ఒక కప్పు నీళ్లు పోసి అందులో ఇడ్లీ ప్లేట్ లను ఉంచి మూత పెట్టాలి. ఈ ఇడ్లీలను 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ఇడ్లీలను బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలను టమాట పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఈ ఇడ్లీలల్లో క్యారెట్, బీట్ రూట్ వంటి వాటిని కూడా వేసుకుని తినవచ్చు. ఈ విధంగా ఇడ్లీలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.