Ravva Laddu : మనం బొంబాయి రవ్వతో వివిధ రకాల అల్పాహారాలను, చిరుతిళ్లను, తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బొంబాయి రవ్వతో చేసుకోదగిన వాటిల్లో రవ్వ లడ్డూలు ఒకటి. ఇవి మనందరికీ తెలిసినవే. రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ ఒక్కోసారి ఈ లడ్డూలు గట్టిగా అవుతుంటాయి. రవ్వ లడ్డూలు గట్టిగా అవ్వకుండా మెత్తగా రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పాలు – అర కప్పు లేదా తగినన్ని, తరిగిన డ్రైఫ్రూట్స్ – తగినన్ని, పంచదార పొడి – ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – పావు కప్పు.
రవ్వ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వను తీసుకోవాలి. తరువాత అందులో పాలను పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 15నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ రవ్వను మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 2 లేదా 3 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు పాలిథీన్ కవర్ ను లేదా బటర్ పేపర్ ను తీసుకుని దానికి నెయ్యిని రాయాలి. తరువాత రవ్వ ముద్దను తీసుకుని చేత్తో కానీ లేదా చపాతీ కర్రతో కానీ మందంగా ఉండే చపాతీలా రుద్దుకోవాలి.
తరువాత పెనాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక చపాతీలా చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి కాల్చుకోవాలి. దీనిని నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ కాల్చుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే ఎండుకొబ్బరి పొడి, పంచదార పొడి వేసి కలుపుకోవాలి.
తరువాత ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. ఈ డ్రైఫ్రూట్స్ ను నెయ్యితో సహా ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత ఈ రవ్వ మిశ్రమాన్ని మనకు కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. నెయ్యి సరిపోకపోతే మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా రుచిగా ఉండే రవ్వ లడ్డూలు తయారవుతాయి. ఈ రవ్వ లడ్డూలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల రెండు వారాల పాటు తాజాగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రవ్వతో ఎంతో రుచిగా ఉండే లడ్డూలను చాలా త్వరగా తయారు చేసుకుని తినవచ్చు.