Egg Ghee Roast : కోడిగుడ్ల‌ను ఇలా ఎప్పుడైనా రోస్ట్ చేశారా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Egg Ghee Roast : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ ఘీ రోస్ట్ కూడా ఒక‌టి. ఇది మ‌నకు ఎక్కువ‌గా ధాబాల‌లో, రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. ఈ ఎగ్ ఘీ రోస్ట్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఘీ రోస్ట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఘీ రోస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 5, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, సోంపు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ల‌వంగాలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, నెయ్యి -పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మలు, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Egg Ghee Roast recipe in telugu make in this method
Egg Ghee Roast

ఎగ్ ఘీ రోస్ట్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, సోంపు, మిరియాలు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత పావు కప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్ల‌ను వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి కూర ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఘీ రోస్ట్ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఎగ్ ఘీ రోస్ట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts