Rose Plant : పువ్వులంటే ఇష్టపడని వారు ఉండనే ఉండరు. అందులోనూ గులాబీ పువ్వులను ఇష్టపడని వారు అస్సలు ఉండరు. స్త్రీలు ఈ గులాబీ పువ్వులను జడలో ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. మనం రకరకాల గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. కొందరు ఎన్ని సార్లు ప్రయత్నించినా గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకోలేక పోతుంటారు. గులాబీ మొక్కలను నాటిన ప్రతిసారీ అవి ఎండిపోవడం, వాడిపోవడం లేదా పెట్టిన మొక్క పెట్టినట్టుగానే ఉండడం, పువ్వులు పూయకపోవడం వంటివి జరుగుతాయి. గులాబీ మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ పూలు పూయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ మొక్కకు కేవలం పూర్తిగా ఎండ తగ్గిన తరువాతే నీటిని పోయాలి. ఎండలో నీటిని పోయడం వల్ల గులాబీ మొక్క చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో కోడి గుడ్లను ఉడికించిన తరువాత ఆ నీటిని పారబోయకుండా ఆ నీరు చల్లగా అయిన తరువాత వాటిని గులాబీ మొక్కలకు పోయాలి. అలాగే కోడి గుడ్డు పెంకులను కూడా మొక్కల మొదట్లో వేయాలి. ఇలా వేసిన వారం రోజుల తరువాత ఆ కోడిగుడ్డు పెంకులను తొలగించాలి. ఈ విధంగా చేయడం వల్ల గులాబీ మొక్కలకు కావల్సిన పోషకాలు లభించి పువ్వులు ఎక్కువగా పూస్తాయి.
అలాగే మనం ఇంట్లో టీ ని తయారు చేసుకున్న తరువాత ఆ టీ పొడిని నాలుగు రోజుల పాటు ఎండబెట్టి గులాబీ మొక్కల మొదట్లో కొద్దిగా గుంతలా చేసి అందులో వేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీ మొక్కలు గుబురుగా పెరిగి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. అంతేకాకుండా మనం తిన్న తరువాత మిగిలిన పండ్ల తొక్కలను పడేయకుండా ముక్కలుగా చేసి ఒక డబ్బాలో వేసి అవి మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టి వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. వారం తరువాత ఆ నీటిని వడకట్టి గులాబీ మొక్కలకు పోయడం వల్ల తగినన్ని పోషకాలు అంది గులాబీ మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా వడకట్టిన నీటిని ఇతర మొక్కలకు కూడా పోయవచ్చు. ఈ విధంగా గులాబీ మొక్కలకు తగిన పోషకాలను ఇవ్వడం వల్ల గులాబీ మొక్కలు గుబురుగా పెరగడమే కాకుండా పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి.