Fried Bun : ఫ్రైడ్ బన్.. మనం ఇంట్లో సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్నాక్ రెసిపీలల్లో ఇది కూడా ఒకటి. ఫ్రైడ్ చాలా రుచిగా ఉంటుంది. లోపల కొబ్బరి స్టఫింగ్ తో తియ్యగా, మెత్తగా ఉండే ఈ బన్ లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగాఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ ఫ్రైడ్ బన్ లను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రైడ్ బన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోరు వెచ్చని పాలు – పావు కప్పు, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, ఈస్ట్ – ముప్పావు టీ స్పూన్, మైదాపిండి – ఒకటిన్నర కప్పు, నూనె- ఒక టేబుల్ స్పూన్.
కొబ్బరి మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి – అర చెక్క, యాలకులు – 3, బెల్లం – అర కప్పు, టూటీ ఫ్రూటీ – 2 టీ స్పూన్స్, జీడిపప్పు పలుకులు -ఒక టేబుల్ స్పూన్.
ఫ్రైడ్ బన్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార, ఉప్పు, ఈస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో మైదాపిండి, నూనె వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు లేదా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై నూనె రాసి మూత పెట్టి 2 గంటల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి గానూ జార్ లో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే జార్ లో బెల్లం వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో టూటీ ఫ్రూటీ, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండిని మరోసారి అంతా కలుపుకుని కొద్దిగా పిండిని తీసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ ముందుగా గిన్నె లాగా వత్తుకోవాలి.
తరువాత ఇందులో కొబ్బరి ఉండను ఉంచి అంచులను చక్కగా మూసివేయాలి. తరువాత దీనిని గుండ్రంగా వచ్చేలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక బన్ లను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బన్ లను మనం ఒవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు. 180 డిగ్రీల వద్ద 25 నుండి 30 నిమిషాల పాటు ఈ బన్ లను బేక్ చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల ఫ్రైడ్ బన్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన బన్ లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.