Function Style Palakura Pappu : మనకు ఫంక్షన్ లలో ఎక్కువగా సర్వ్ చేసే వంటకాల్లో పాలకూర పప్పు కూడా ఒకటి. ఫంక్షన్ లల్లో చేసే ఈ పాలకూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అన్నంతో, బగారా అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఫంక్షన్ స్టైల్ పాలకూరపప్పును మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఒకేరకంగా కాకుండా ఇలా మరింత రుచిగా ఈ పాలకూర పప్పును తయారు చేసుకోవచ్చు. ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన కందిపప్పు – ఒక టీ గ్లాస్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 4 కట్టలు, పచ్చిమిర్చి – 10 నుండి 12, వెల్లుల్లి రెబ్బలు – 12, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, చింతపండు రసం – పావు కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్.
పాలకూర పప్పు తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన కందిపప్పును కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, పసుపు, నూనె, కరివేపాకు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత పాలకూర, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ పాలకూర దగ్గర పడే వరకు మగ్గించాలి. పాలకూర మగ్గిన తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. ఈ పప్పును మరో 6 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పాలకూర పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.