Godhuma Pindi Halwa : మనకు బయట అనేక రకాల తీపి పదార్థాలు లభిస్తూ ఉంటాయి. మనకు లభించే తీపి పదార్థాలలో హల్వా కూడా ఒకటి. దీని రుచి మనందరికీ తెలుసు. హల్వాను మైదా పిండి లేదా కార్న్ ఫ్లోర్ తో తయారు చేస్తూ ఉంటారు. దీనిని చాలా మంది ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. హల్వాను మైదా పిండి, కార్న్ ఫ్లోర్ తోనే కాకుండా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసే హల్వా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసిన హల్వాను తినడం వల్ల శరీరానికి కూడా మేలు కలుగుతుంది. గోధుమ పిండితో హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, జీడి పప్పు – కొద్దిగా.
గోధుమ పిండి హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లేదా గిన్నెకు నెయ్యిని రాసి పక్కకు ఉంచాలి. ఒక కళాయిలో అర కప్పు నెయ్యిని పోసి నెయ్యి వేడయ్యాక గోధుమపిండిని వేసి చిన్న మంటపై రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత బెల్లం తురుమును వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత ముందుగా మరిగించిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ గోధుమ పిండి మిశ్రమం కళాయికి అతుక్కుపోకుండా రంగు మారే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత యాలకుల పొడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకుని సమానంగా చేసి చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ లేదా గిన్నె నుండి వేరు చేసి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కావల్సిన పరిమాణంలో కత్తితో ముక్కలుగా కట్ చేసి జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి హల్వా తయారవుతుంది. ఇందులో బెల్లాన్ని ఒక కప్పు కంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మైదా పిండి లేదా కార్న్ ఫ్లోర్ తో చేసే హల్వాకు బదులుగా ఇలా గోధుమ పిండిని, బెల్లాన్ని కలిపి కూడా హల్వాను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.