Coconut Chutney : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశ, ఇడ్లీ, ఊతప్పం వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. వీటిని తినడానికి మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ చట్నీలు రుచిగా ఉంటేనే దోశ, ఇడ్లీ వంటివి రుచిగా ఉంటాయి. హోటల్స్ లో లభించే కొబ్బరి చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని అంతే రుచిగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. హోటల్స్ లో చేసే విధంగా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు – రెండు టేబుల్ స్పూన్స్, కొద్దిగా వేయించిన పుట్నాల పప్పు – ఒకటేబుల్ స్పూన్, వేయించిన పచ్చి మిర్చి – తగినన్ని, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 5 లేదా 6.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలను, పల్లీలను, పుట్నాలను, పచ్చి మిర్చిని వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను, ఉప్పును, వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీ , ఊతప్పం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.