Godhuma Rava Laddu : గోధుమ రవ్వతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గోధుమ రవ్వతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. గోధుమ రవ్వతో మనం ఎక్కువగా ఉప్మా, కేసరి, హల్వా వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోధుమ రవ్వతో మనం లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి చూడడానికి అచ్చం మోతీచూర్ లడ్డూల వలె ఉంటాయి. రుచిగా, సులభంగా గోధుమ రవ్వతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, గోధుమరవ్వ – పావు కిలో, నీళ్లు – 3 గ్లాసులు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు, బాదం పలుకులు లేదా పుచ్చకాయ గింజలు – కొద్దిగా.
గోధుమ రవ్వ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి వేయించాలి. తరువాత కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై రవ్వ మెత్తగా అయ్యి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మరలా రెండు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని లడ్డూ చుట్టడానికి వచ్చేలా దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా పుచ్చకాయ గింజలను లేదా బాదం పలుకులను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
దీనిపై మూతను ఉంచి చల్లగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ లడ్డూ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు గోధుమ రవ్వతో లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.