మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవుని ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తాము. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక ఆవుని గోమాతగా భావించి పూజిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రోజులలో లేదా పండుగల సమయాలలో గోమాతకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. గోమాతను పూజించడం వలన సకల దేవతల ఆశీర్వాదం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా గోమాతలో ఏ భాగంలో ఏ దేవతలు కొలువై ఉంటారో, వారిని పూజించడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
గోమాత పాదాలలో పితృదేవతలు అలానే గొలుసు తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు కొలువై ఉంటాయి. నోటిలో లోకేశ్వరం, నాలుక పై వేదాలు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు ముఖంలో జ్యేష్ఠా దేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారని పండితులు చెప్పారు.
అదేవిధంగా గోమాత కంఠంలో విష్ణుమూర్తి, భుజాన సరస్వతి, వెనుక భాగంలో లక్ష్మీదేవి, మూపురంలో బ్రహ్మదేవుడు రొమ్ము భాగంలో నవగ్రహాలు కొలువై ఉంటాయి. ఇంతమంది దేవతలు గోమాతలో కొలువై వుండటం వల్ల గోమాతను హిందువులు ఎంతో పవిత్రంగా భావించి పూజలు నిర్వహిస్తారు.