Gondh Laddu : గోంధ్.. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. గోంధ్ లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. శరీరంలో వేడిని తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలను తగ్గించడంలో గోంధ్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు దీనిని తీసుకోవడం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోంధ్ తో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ గోంధ్ తో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంధ్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బాదంపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కర్బూజ గింజలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – పావు కిలో, గోంధ్ – 100 గ్రా., గోధుమపిండి – 100 గ్రా., బెల్లం తరుము – 250 గ్రా., యాలకుల పొడి – అర టేబుల్ స్పూన్, శొంఘి పొడి – అర టేబుల్ స్పూన్.
గోంధ్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండ కొబ్బరి తురుమును వేసి మధ్యస్థ మంటపై 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి అర నిమిషం పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మరికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోంధ్ ను వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. గోంధ్ చక్కగా వేగి సగ్గుబియ్యం పొంగినట్టు పొంగగానే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ గోంధ్ ను చల్లారిన తరువాత కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమపిండిని వేసి వేయించాలి. గోధుమపిండి ముద్దగా అయ్యి ఆతరువాత నెయ్యిని వదులుతూ పలుచగా తయారవుతుంది. ఇలా గోధుమపిండి పీల్చుకున్న నెయ్యిని వదులుతుండా దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే కళాయిలో మిగిలిన నెయ్యి, బెల్లం తురుము వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి తీగపాకం వచ్చే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, శొంఠి పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ బెల్లం మిశ్రమంలో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన గోధుమపిండి, మిక్సీ పట్టుకున్న గోంధ్ వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గోంధ్ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా గోంధ్ తో లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.