Gongura Chicken Curry : గోంగూర చికెన్ క‌ర్రీని ఇలా చేశారంటే.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Gongura Chicken Curry : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోంగూర చికెన్ కూడా ఒక‌టి. గోంగూర చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ పుల్ల‌గా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ గగోంగూర చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర చికెన్ కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – 500 గ్రా., గోంగూర – 3 క‌ట్ట‌లు( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ట‌మాటాలు – 2, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, అల్లం – రెండు ఇంచుల ముక్క‌ల‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, చికెన్ మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Gongura Chicken Curry recipe in telugu very tasty easy to cook
Gongura Chicken Curry

గోంగూర చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ధ‌నియాలు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, యాల‌కులు, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌ల, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత మ‌సాలా పేస్ట్, ఉప్పు, ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా, చికెన్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత గోంగూర వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత చికెన్ పై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌ర‌చూ చేసే చికెన్ క‌ర్రీల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా గోంగూర చికెన్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వచ్చు.

D

Recent Posts