Gongura Chicken : గోంగూర చికెన్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. అలాగే వంటకాన్ని కూడా మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా త్వరగా అయ్యేలా అలాగే రుచిగా ఉండేలా గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 100 గ్రా., చికెన్ – అర కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – 1, లవంగాలు – 4, యాలకులు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1 ( పెద్దది), ఉప్పు – తగినంత,పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్.
గోంగూర చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను ఉప్పు, పసుపును వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గోంగూరను వేసి కలపాలి. గోంగూరలో ఉండే నీరు అంతా పోయి గోంగూర మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యక మసాలా దినుసులను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి,జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాట ముక్కలను, ఉప్పును, పసుపును వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత చికెన్ ముక్కలను వేసి కలపాలి. వీటిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కారం వేసి కలిపి కళాయిపైమూతను ఉంచి చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. తరువాత ఉడికించిన గోంగూరను వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత దీనిలో ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత దీనిపైమూతను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత నీళ్లు, కొత్తిమీర,పుదీనా వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, పులావ్, బిర్యానీ, రోటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ కూర కంటే కూడా గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.