Gongura Endu Royyalu : గోంగూర‌, ఎండు రొయ్య‌లు క‌లిపి ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Gongura Endu Royyalu : మ‌నం గోంగూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. గోంగూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటినూ కాకుండా మ‌నం గోంగూర‌తో నాన్ వెజ్ వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర‌తో చేసుకోద‌గిన నాన్ వెజ్ వంట‌కాల్లో గోంగూర ఎండు రొయ్య‌ల కూర ఒక‌టి. ఎండు రొయ్య‌లు, గోంగూర క‌లిపి చేసే ఈ కూర పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, రొయ్య‌ల వాస‌న లేకుండా గోంగూర ఎండురొయ్య‌ల కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర ఎండు రొయ్య‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండు రొయ్య‌లు – 200 గ్రా., నీళ్లు – అర లీట‌ర్, నూనె – అర క‌ప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, శుభ్రం చేసిన‌ ఎర్ర గోంగూర – 2 క‌ట్ట‌లు, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Gongura Endu Royyalu recipe in telugu very tasty how to make it
Gongura Endu Royyalu

గోంగూర ఎండు రొయ్య‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అర లీట‌ర్ నీళ్లు పోసి అందులో శుభ్రం చేసుకున్న రొయ్య‌ల‌ను వేసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఈ రొయ్య‌ల‌ను చ‌ల్ల‌టి నీటిలో వేసి రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత శుభ్రం చేసుకున్న రొయ్య‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ రొయ్య‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత గోంగూర, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. గోంగూర మ‌గ్గి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్య‌ల కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గోంగూరతో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా రొయ్య‌ల‌ను వేసి కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts