Gongura Kura : మనలో చాలా మంది గోంగూరతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. గోంగూర మన ఆరోగ్యానికిఎంతో మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మనకు సహాయపడుతుంది. గోంగూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పప్పు, పచ్చడే కాకుడా గోంగూరతో మనం కూరను కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ, గోంగూర కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. రుచిగా, చూడగానే నోట్లో నీళ్లు ఊరేలా గోంగూర కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 2 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), సొరకాయ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు -తగినంత,నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, శనగపప్పు -ఒక టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – ఒక రెమ్మ.
గోంగూర కూర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో శుభ్రంగా కడిగిన గోంగూరను తీసుకోవాలి. తరువాత కొత్తిమీర తప్పమిగిలిన పదార్థాలన్నీ వేసి మూత పెట్టాలి. దీనిని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి గోంగూరను మెత్తగా చేసుకోవాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి మరో 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న గోంగూరను వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో తరచూ చేసే పచ్చళ్లే కాకుండా ఇలా కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.