Google Play Pass : ఇక యాడ్స్ లేకుండానే ప్లే స్టోర్ యాప్స్‌ను వాడుకోవ‌చ్చు.. గూగుల్ నుంచి ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌..

Google Play Pass : ప్ర‌ముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భార‌త్‌లో త‌న ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు నెల‌కు రూ.99 చెల్లిస్తే.. గేమ్స్ లేదా యాప్స్‌ను యాడ్స్ లేకుండా, ఇన్ యాప్ ప‌ర్చేసెస్ అవ‌స‌రం లేకుండా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ సేవ‌ల‌ను గూగుల్ 2019లో అమెరికాలో ప్రారంభించింది. త‌రువాత పలు ఇత‌ర దేశాల‌కు ఈ సేవ‌ల‌ను విస్త‌రించింది. ఇక తాజాగా భార‌త్‌లోనూ ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్ 90కి పైగా దేశాల్లో ల‌భిస్తోంది.

Google Play Pass  subscription service now available in India
Google Play Pass

ఈ స‌ర్వీస్‌లో భాగంగా 41 విభాగాల్లోని 1000కి పైగా యాప్స్‌, గేమ్స్‌ను యూజ‌ర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా ఉప‌యోగించుకోవ‌చ్చు. వాటిల్లో యాడ్స్ రావు. అలాగే కొన్నింటిలో సేవ‌ల‌ను పొందాలంటే ఇన్ యాప్ ప‌ర్చేసెస్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. క‌నుక యూజ‌ర్ల‌కు ఇది ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంద‌ని గూగుల్ తెలియ‌జేసింది. అలాగే ఇది డెవ‌ల‌ప‌ర్ల‌కు కూడా మేలు చేస్తుంద‌ని గూగుల్ వివ‌రించింది.

గూగుల్ ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్ ను నెల‌కు రూ.99 చెల్లించి పొంద‌వ‌చ్చు. ఏడాదికి అయితే రూ.889 అవుతుంది. అదే ప్రీపెయిడ్ ప‌ద్ధ‌తిలో అయితే నెల‌కు రూ.109 చెల్లించాలి. అలాగే ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఈ స‌ర్వీస్‌ను త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి షేర్ చేసుకోవ‌చ్చు. 5 మందికి ఈ స‌ర్వీస్‌ను షేర్ చేయ‌వ‌చ్చు.

గూగుల్ ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్ ను పొందాలంటే ప్లే స్టోర్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో కుడి వైపు పైభాగంలో ఉండే ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. అనంత‌రం ప్లే పాస్ పై ట్యాప్ చేయాలి. ఇక అందులో ఉండే స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్ ను నిర్దిష్ట‌మైన రుసుము చెల్లించి పొంద‌వ‌చ్చు.

ఈ సర్వీస్‌ను భార‌త్‌లో లాంచ్ చేసిన సంద‌ర్భంగా గూగుల్ ఇండియా ప్లే పార్ట్‌న‌ర్‌షిప్స్ డైరెక్ట‌ర్ ఆదిత్య స్వామి మాట్లాడుతూ.. యూజర్ల‌కు, డెవ‌ల‌ప‌ర్ల‌కు మ‌రింత మేలు చేసేందుకే ఈ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. అలాగే అనేక యాప్స్, గేమ్స్‌ను రూపొందించేందుకు డెవ‌ల‌ప‌ర్ల‌కు మ‌రింత అవ‌కాశం ల‌భిస్తుంద‌ని.. యూజ‌ర్లు ఈ సేవ‌ల ద్వారా యాప్స్‌ను మ‌రింత సుల‌భంగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Share
Editor

Recent Posts