Goruchikkudukaya Vepudu : గోరు చిక్కుడు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె గోరు చిక్కుడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. గోరు చిక్కుడుతో ఎలాంటి కూర చేసిన కూడా తినని వారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే కింద చెప్పిన విధంగా గోరుచిక్కడుతో వేపుడు చేయడం వల్ల దీనిని ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. గోరు చిక్కుడుతో రుచిగా వేపుడును ఎఆ తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు చిక్కుడు వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన గోరు చిక్కుడు – అరకిలో, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గోరుచిక్కుడు వేపుడు తయారీ విధానం..
ముందుగా గోరు చిక్కుడును శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిలో అర టీ స్పూన్ ఉప్పు, ఒక లీటర్ నీటిని పోసి ముక్కలు మెత్తగా య్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన గోరుచిక్కడు ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. వీటిని పది నిమిషాల పాటు వేయించాలి.
తరువాత పసుపు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. తరువాత పచ్చి కొబ్బరి ముక్కల మిశ్రమం, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కడుకాయల వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా గోరు చిక్కుడు వేపుడును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ వేపుడును విడిచి పెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.