Green Chilli Pachadi : పచ్చిమిర్చిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కూరల్లోనే కాకుండా పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఇతర కూరగాయలు వేయకుండా కేవలం పచ్చిమిర్చితోనే మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసేవారు. పచ్చిమిర్చితో చేసే ఈ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చితో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – ఒక టీ స్పూన్, కారం మధ్యస్థంగా ఉండే పచ్చిమిర్చి – 300 గ్రా., చిక్కటి చింతపండు రసం – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, బెల్లం – ఒక టీ స్పూన్.
పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు వేసి వేయించాలి. తరువాత మినపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఈ తాళింపును ఒక జార లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో 4టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి పచ్చిమిర్చిని చక్కగా వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.
తరువాత ఇందులో ఉప్పు, మిక్సీ పట్టుకున్న తాళాంపు, చింతపండు రసం, బెల్లం వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని మరలా తాళింపు కూడా చేయవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, ముద్ద పప్పు, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేరకం పచ్చళ్లు కాకుండా పచ్చిమిర్చితో అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.