ఆధ్యాత్మికం

రామ‌ప్ప ఆల‌య శిల్ప క‌ళా సౌంద‌ర్యం.. వ‌ర్ణించ‌న‌ల‌వి కానిది.. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి..!

తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్న రామ‌ప్ప దేవాల‌యానికి యునెస్కో గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఆల‌యం గురించి తెలుసుకునేందుకు, ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ ఆల‌యాన్ని కాక‌తీయరాజులు నిర్మించారు. హైద‌రాబాద్‌కు 157 కిలోమీట‌ర్ల దూరంలో, వ‌రంగ‌ల్‌కు 70 కిలోమీట‌ర్ల దూరంలో.. ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఈ ఆల‌యం ఉంది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.

ఈ ఆల‌యం చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా నిలుస్తుంది. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించిన‌ట్లు తెలుస్తుంది.

have you seen ramappa temple beauty

ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా రావ‌డం నిజంగా గ‌ర్వ‌కార‌ణ‌మే. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం వంటివి ఈ ఆల‌య ప్ర‌ధాన‌ విశిష్ట‌త‌లుగా చెప్ప‌వ‌చ్చు.

ప్రస్తుతం రామప్ప జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు (రుద్రయ్య) కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం.

ఈ ఆలయ నిర్మాణంలో కాక‌తీయుల శైలి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఆరు అడుగుల ఎత్తైన న‌క్ష‌త్ర మండ‌పంపై ఆల‌యాన్ని నిర్మించారు. ఈ ఆలయం తూర్పు దిక్కుగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగంలో మూడు వైపులా ప్రవేశ ద్వారం గల మహామండపం ఉంటాయి. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది. దీంట్లో మహామండపం మధ్య భాగంలో గ‌ల కుడ్య స్థంభాలు, వాటిపై ఉండే రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథ‌లతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాల‌ను కలిగి ఉంటాయి. ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు కింది భాగంలో నల్లని నునుపు రాతి ఫ‌లకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు ఉంటాయి. ఇవి కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఈ దేవాలయ ప్రాంగణంలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. దేవాలయం శిల్ప సంపదలో కాకతీయ రాజుల నాటి శైలి క‌నిపిస్తుంది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవ‌ని చెబుతారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.

గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుడి సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా అందంగా చెక్కబడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవికానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా ఈ నాటికీ చూప‌రులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీభవించి స్థంబాలమీదా, కప్పులమీదా కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్ల రాతి నాట్యగ‌త్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణ‌లు, వాటి త్రిభంగి నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తాయి. దేవాలయంలోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యాల వారిగా రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంటుంది.

ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వల్ల‌ అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తోంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం క‌ల్పిస్తున్నారు. ప్ర‌తి ఏటా మహాశివరాత్రి ఉత్సవాల‌ను 3 రోజులపాటు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.

Admin

Recent Posts