Saggubiyyam Semiya Payasam : అప్పుడప్పుడూ మనం వంటింట్లో సేమ్యాను ఉపయోగించి పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. సేమ్యాతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా మనం ఈ పాయసాన్ని చేసుకోవచ్చు. కేవలం సేమ్యానే కాకుండా దీంట్లో సగ్గుబియ్యాన్ని కూడా వేస్తుంటారు. సేమ్యా, సగ్గుబియ్యం వేసి చేసే ఈ పాయసాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ పాయసం చల్లారే కొద్దీ గట్టి పడుతుంటుంది. సేమ్యాను, సగ్గుబియ్యాన్ని ఉపయోగించి పాయసం చల్లారిన తరువాత గట్టిపడకుండా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమ్యా సగ్గుబియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – పావు కప్పు, సేమ్యా – ముప్పావు కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, నీళ్లు – రెండు కప్పులు, పంచదార – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – 4 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
సేమ్యా సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అర గంట నుండి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో సేమ్యాను వేసి రంగు మారే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నీళ్లను పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తరువాత వేయించిన సేమ్యాను కూడా వేసి కలిపి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు సేమ్యా మెత్తపడే వరకు ఉడికించాలి.
తరువాత మూత తీసి పంచదారను వేసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత పాలను పోసి కలిపి పాలు కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడిని, వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి. ఈ పాయసం చల్లగా అయ్యే కొద్దీ దగ్గర పడుతుంది. కనుక కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం తయారవుతుంది. ఇలా చేయడం వల్ల పాయసం చల్లారిన తరువాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల పాయసం ఎప్పుడు చేసినా కూడా ఒకే విధంగా చక్కగా వస్తుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా సేమ్యా సగ్గుబియ్యం పాయసాన్ని చేసుకుని తినవచ్చు. ఇలా చేసిన పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.