Dry Fruit Laddu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ ఒకటి. ఇవి చాలా ధరను కలిగి ఉంటాయని అందరూ వీటిని తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ లడ్డూల రూపంలో వీటిని తయారు చేసి తినవచ్చు. రోజుకు ఒక లడ్డూను తిన్నా చాలు.. అన్ని డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలను పొందవచ్చు. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకుని తినవచ్చు. దీంతో డబ్బులు కూడా కలసి వస్తాయి. ఇక డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించి లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, కిస్మిస్, అంజీర్, ఖర్జూరం – అన్నింటినీ 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – తగినంత.
డ్రై ఫ్రూట్స్ లడ్డూలను తయారు చేసే విధానం..
ముందుగా పెనంలో నెయ్యి వేసి వేడయ్యాక బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్‌ను వేసి వేయించాలి. ఇవి వేగాక బయటకు తీసి పక్కన పెట్టాలి. మళ్లీ పాన్ లో కాస్త నెయ్యి వేసి వేడయ్యాక కిస్మిస్, అంజీర్, ఖర్జూరం పండ్లను వేసి వేయించాలి. ఇవి కూడా వేగాక పక్కన పెట్టాలి. అన్నీ చల్లగా అయ్యాక బాగా కలిపి మిక్సీలో వేసి కాస్త పలుకుగా ఉండేలా పట్టుకోవాలి.
అనంతరం ఆ మిశ్రమంలో మళ్లీ కాస్త వేడి చేసిన నెయ్యిని వేయాలి. అలాగే తగినంత యాలకుల పొడిని వేసి కూడా కలపాలి. ఈ మిశ్రమం కాస్త వెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యిని రాసుకుంటూ కాస్త తీసుకుని లడ్డూలలా వత్తుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తం అయిపోయే వరకు లడ్డూలను చేయాలి. దీంతో డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే వారం లేదా పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తిన్నా చాలు.. అమితమైన బలం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల వ్యాధులు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. ఇక ఈ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.