Prawns Pickle : మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటినీ అందించే ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. రొయ్యలతో వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ రొయ్యలతో మనం నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. రొయ్యలతో చేసే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభమే. పక్కా కొలతలతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పచ్చడి రుచిగా ఉండడంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన రొయ్యలు – అర కిలో, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 4, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 150 ఎంఎల్, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – ఒక టీ స్పూన్, కారం – 4 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయలు – 2 ( పెద్దవి).
రొయ్యల పచ్చడి తయారీ విధానం..
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిపై ఒక టీ స్పూన్ ఉప్పును, అర టీ స్పూన్ పసుపును వేసి కలిపి మూత పెట్టి అర గంట పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఒక కళాయిలో దాల్చిన చెక్కను, లవంగాలను, యాలకులను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ధనియాలను వేసి వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వీటిని ఒకజార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉండే ఒక కళాయిని తీసుకుని అందులో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసి అడుగు భాగం మాడకుండా కలుపుతూ వేయించాలి.
రొయ్యలలోని నీరు అంతా పోయి రొయ్యలపై భాగం రంగు మారి కరకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఈ రొయ్యలను వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది రంగు మారే వరకు వేయించాలి. తరువాత రెండు టీ స్పూన్ల ఉప్పును, ఒక టీ స్పూన్ పసుపును, కారాన్ని వేసి కలపాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మసాలా పొడి కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా వేయించిన రొయ్యలను కూడా వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లగా అయిన తరువాత అందులో నిమ్మ కాయలను కోసి రసం అంతా పిండి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ పచ్చడిని తడి లేని గాజు సీసాలో ఉంచి ఒక రోజంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ పచ్చడిని అంతా ఒకసారి కలిపిన తరువాత తినడానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి తయారవుతుంది. అన్నంతో కలిపి తింటే ఈ రొయ్యల పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఈ పచ్చడి రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది.