Hotel Style Puri Kurma : హోట‌ల్స్‌లో ల‌భించే పూరీ కుర్మా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Hotel Style Puri Kurma : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువ‌గా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఈ పూరీల‌ను తిన‌డానికి మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఎక్కువ‌గా పూరీ కుర్మాను త‌యారు చేస్తూ ఉంటారు. పూరీ కుర్మాతో తింటే పూరీలు మ‌రింత రుచిగా ఉంటాయి. కింద చెప్పిన విధంగా చేసే హోట‌ల్ స్టైల్ పూరీ కుర్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. హోట‌ల్ స్టైల్ పూరీ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పూరీ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన బీన్స్ – 5, త‌రిగిన చిన్న క్యారెట్ – 1, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉడికించిన బఠాణీ – 2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప‌లు – 3, నీళ్లు – అర గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Hotel Style Puri Kurma recipe very tasty make like this at home
Hotel Style Puri Kurma

పూరీ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత బీన్స్, క్యారెట్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాటాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత బ‌ఠాణీ వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. వీటిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, క‌సూరిమెంతి వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా పూరీల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts