Egg Keema Masala : కోడిగుడ్లు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్లను తినడం వల్ల మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కోడిగుడ్లలో ఉండే లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మన కంటి చూపును మెరుగు పరుస్తాయి. దీంతోపాటు కళ్లను సంరక్షిస్తాయి. గుడ్లలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా కోడిగుడ్లను తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కోడిగుడ్లతో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు.
కోడిగుడ్లతో చేసే వంటల్లో ఎగ్ కీమా మసాలా కూడా ఒకటి. సరిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని కేవలం రెస్టారెంట్లలోనే వండుతారు. ఇంట్లో వండడం కష్టంగా ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని టిప్స్‌ను పాటిస్తే ఎగ్ కీమా మసాలాను మనం ఇంట్లోనే ఎంతో రుచిగా వండుకోవచ్చు. ఇక ఎగ్ కీమా మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీన్ని ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లు పెద్దవి – 4, చికెన్ లేదా మటన్ కీమా – 300 గ్రాములు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పెద్దది – 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – 2 లేదా 3 (చిన్నగా కట్ చేయాలి), అల్లం – 1 టేబుల్ స్పూన్ (తరిగినది), పచ్చి మిర్చి – 2 లేదా 3 (సన్నగా తరగాలి), టమాటాలు – 2 పెద్దవి (సన్నగా తరగాలి), పెరుగు – పావు కప్పు, గరం మసాలా పొడి – 2 టీస్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, పసుపు – 1 టీస్పూన్, కారం – 1 టీస్పూన్, ధనియాలు – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర ఆకులు – కొన్ని (గార్నిష్ కోసం).
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కోడిగుడ్లను వేసి ఉడికించాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి 8 నుంచి 10 నిమిషాల పాటు గుడ్లను ఉడికించాలి. తరువాత కోడిగుడ్లను చల్లార్చాలి. అనంతరం పొట్టు తీసి పక్కన పెట్టాలి. ఒక పెద్ద పాన్‌లో నూనె వేసి మీడియం మంటపై వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చి మిర్చి వేసి మరో 1-2 నిమిషాల పాటు సువాసన వచ్చే వరకు వేయించాలి.
తరువాత పసుపు, కారం, ధనియాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం చికెన్ లేదా మటన్ కీమాను వేసి బాగా కలిపి ఉడికించాలి. తరువాత తరిగిన టమాటాలను వేసి ఉడికించాలి. తరువాత పెరుగు వేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మిశ్రమం నుంచి నూనె బయటకు వచ్చి మిశ్రమం గట్టిపడే వరకు ఉడికించాలి. అనంతరం కూరలో గరం మసాలా పొడి వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లను నిలువుగా రెండుగా కట్ చేయాలి. అనంతరం వాటిని కూరలో కలపాలి. తరువాత స్టవ్‌ను సిమ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో కోడిగుడ్లకు మిశ్రమం బాగా అంటుకుంటుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి కూరను దించేయాలి. దానిపై కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన ఎగ్ కీమా మసాలా రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీలు, చపాతీలతో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.