Sorakaya Pachadi : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో సొరకాయలు కూడా ఒకటి. సొరకాయలను సహజంగానే చాలా మంది తినేందుకు సంశయిస్తుంటారు. ఇవి అంత టేస్టీగా ఉండవు. సొరకాయలతో చాలా మంది వివిధ రకాల వంటలను చేస్తుంటారు. సొరకాయను పచ్చడి, బజ్జీ రూపంలో చేస్తారు. టమాటా వేసి వండుతారు. చాలా మంది సొరకాయలను సాంబార్‌లో వేస్తారు. అయితే వాస్తవానికి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనకు సొరకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే గుణాలు ఉంటాయి. సొరకాయల్లో మన శరీరానికి అవసరం అయిన అనేక మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
సొరకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు సొరకాయలను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. కనుక సొరకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే సొరకాయలతో చేసే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని సరిగ్గా చేయాలే కానీ అన్నంలో నెయ్యితో కలిపి తింటే వచ్చే రుచే వేరేగా ఉంటుంది. ఇక సొరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలను వేసి వేయించుకుని పక్కన పెట్టాలి. మళ్లీ కాస్త నూనె వేసి వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ ముక్కలు, టమాటాలు, పసుపు వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి. తరువాత వాటిని సన్నని మంటపైనే 8 నుంచి 10 నిమిషాల పాటు 80-90 శాతం ఉడికేలా ఉడికించాలి. తరువాత చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అనంతరం అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టాలి. వీటిని మీరు రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. రోట్లో ఈ పచ్చడిని చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. చివర్లో ఉప్పు కలుపుకోవాలి. తరువాత పచ్చడిని పోపు వేసుకోవాలి. అనంతరం పచ్చడిపై కొత్తిమీర ఆకులను వేసి గార్నిష్ చేయాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అవుతుంది. దీంట్లో మీరు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పచ్చడిని ఎందులో అయినా సరే తినవచ్చు. అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. లేదా చపాతీలు, ఇడ్లీలు, దోశలు వంటి టిఫిన్లతోనూ ఈ పచ్చడిని ఆరగించవచ్చు. ఇలా సొరకాయతో పచ్చడి చేసి తినడం వల్ల పోషకాలు కూడా నశించవు. దీంతో సొరకాయల్లో ఉండే పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. అప్పుడు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక సొరకాయను తరచూ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.