How To Make Pakoda Crunchy : సాయంత్రం సమయంలో చల్లని వాతావరణంలో పకోడీలను వేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. బజ్జీలను, పునుగులను తినే వారు కూడా చాలా మందే ఉంటారు. కానీ అవి మెత్తని ఆహారాలు. పకోడీలు కాస్త గట్టిగా, క్రంచీగా ఉంటాయి. కనుక చాయ్ ప్రేమికులు చాలా మంది పకోడీలను ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో కరివేపాకు, పచ్చిమిర్చి తగులుతుంటే వచ్చే మజాయే వేరుగా ఉంటుంది. అయితే పకోడీలను స్వీట్ షాపుల్లో కొంటే కరకరలాడుతూ నోరూరిస్తాయి. కానీ మన ఇంట్లో చేస్తే మాత్రం ఆ టేస్ట్ రాదు. కానీ ఈ చిట్కాలను పాటిస్తే పకోడీలను కరకరలాడేలా చేయవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అందరికీ ఇష్టమైన స్నాక్స్‌గా పకోడీలను చెప్పవచ్చు. రుచిలో కొత్తదనం కోరుకునేవారు పకోడీల్లో ఉల్లిపాయ మాత్రమే కాకుండా పాలకూర, ఆలు వంటివి కలుపుతారు. అయితే పకోడీలు కరకరలాడేలా రావాలంటే మాత్రం ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. పకోడీల కోసం పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి వేయాలి. దాంతో పకోడీలు కరకరలాడుతాయి. అంతేకాదు నూనె కూడా తక్కువ పీల్చుకుంటాయి. అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కూరగాయలను సన్నగా తరగాలి. దీని వల్ల పకోడీలు తేలిగ్గా ఉంటాయి. వేయిస్తే కరకరలాడుతాయి.
పిండిలో నీళ్లు సరిపోను పోయాలి. నీళ్లు ఎక్కువైతే నూనెలో పకోడీలను వేయించేటప్పుడు బయటికి వస్తాయి. పకోడీలు సరిగ్గా రావు. బేకింగ్ సోడాను కలిపితే పిండి తేలిగ్గా ఉంటుంది. దీంతో పకోడీలు కరకరలాడుతూ తయారవుతాయి. పకోడీల పిండి మరింత తేలికగా ఉండేందుకు స్పూన్‌తో కాకుండా విస్క్‌తో కలపాలి. పకోడీలను మీడియం మంటపై వేయిస్తే కూరగాయ ముక్కలు సరిగ్గా ఉడుకుతాయి. టేస్టీగా ఉంటాయి. నూనె బాగా వేడెక్కాక పకోడీలను వేయించాలి. లేదంటే అవి ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి.
లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు పకోడీలను వేయించాలి. ఒక చిన్న పాత్రలో నీళ్లు, కిచెన్ టవల్ అందుబాటులో ఉంచుకోవాలి. కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వంటివి పిండిలో ముంచి పకోడీలు వేయించేముందు నీళ్లతో చేతిని తడుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేతులకు పిండి అంటుకోదు. పైగా పకోడీలను వేయిస్తే కరకరలాడుతూ వస్తాయి. ఈ విధంగా పకోడీలను స్వీట్ షాపుల్లో లభించే విధంగా కరకరలాడేలా తయారు చేసుకోవచ్చు.