Sorakaya Manchuria : సొరకాయ అనగానే చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. సొరకాయలను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే సొరకాయలతో మనం పలు రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. వాటిల్లో మంచూరియా కూడా ఒకటి. దీన్ని సరిగ్గా చేయాలే కానీ ఎంతో రుచిగా ఉంటుంది. బయట బండ్లపై మనకు గోబీ మంచూరియా లభిస్తుంది. అయితే క్యాలిఫ్లవర్‌ను తినలేని వారు సొరకాయలతో మంచూరియాను ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసి తినవచ్చు. సాయంత్రం సమయంలో వేడిగా తింటే ఈ మంచూరియా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక సొరకాయ మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ తురుము – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీస్పూన్, కారం – 1 టీస్పూన్, గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు, మైదా – 4 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, వంట సోడా – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత.
ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 1, ఉల్లికాడలు – 2, కరివేపాకు – 5 రెబ్బలు, కొత్తిమీర – తగినంత, చిల్లీ సాస్ – 1 టీస్పూన్, టమాటా సాస్ – 2 టీస్పూన్లు, నూనె – తగినంత.
సొరకాయను తొక్కు తీసి సన్నగా తరగాలి. తరువాత అందులో గోధుమ పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, వంట సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం అన్నీ వేసి కలపాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు చిలకరించి మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి. అలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇప్పుడు బాణలిలో నూనె అంతా వంపేసి అడుగున కొద్దిగా ఉంచి ఉల్లిముక్కలు, ఉల్లికాడల ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత చిల్లీసాస్, టమాటా సాస్, కొత్తిమీర తురుము వేసి కలిపి అందులోనే మంచూరియాను వేసి ఒక నిమిషం ఉడికించి దించాలి. దీంతో ఘుమ ఘుమలాడే సొరకాయ మంచూరియా రెడీ అవుతుంది. పచ్చి ఉల్లిపాయ, నిమ్మరసంతో దీన్ని లాగించేయవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.