Sunnundalu : మనం మినపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మినపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మినపప్పుతో ఎక్కువగా ఇడ్లీ, దోశ, వడలు వంటి అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటితో పాటు సున్నుండలను కూడా తయారు చేస్తూ ఉంటాము. సున్నుండలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సున్నుండలను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ సున్నుండలను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సున్నుండల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినుములు – ఒక కప్పు, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక కప్పు, కరిగించిన నెయ్యి – అర కప్పు.
సున్నుండల తయారీ విధానం..
ముందుగా కళాయిలో మినుములను వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.తరువాత ఇందులో బియ్యం వేసి కలిపి చల్లారనివ్వాలి. తరువాత ఈ మినుములను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బెల్లం తురుము కూడా వేసి మిక్సీ పట్టుకుని మినుముల పొడిలో వేసుకుని అంతా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సున్నుండలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా సున్నుండలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.