Cholesterol Risk : నేటి తరుణంలో మనలో చాలా మంది చిన్న వయసులోనే చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల మనం గుండెపోటుతో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలతో కూడా బాధపడాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో గుండెపోటు బారిన పడే వారి సంఖ్య మరింతగా పెరిగింది. కొందరు గుండెపోటు కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. రక్తంలో ఎక్కువగా ఉండే ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల అంచుల వెంబడి పేరుకుపోతుంది.
దీంతో రక్తసరఫరాకు అడ్డంకులు ఏర్పడి గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. నూనెలో వేయించిన పదార్థాలు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాయామం చేయని వారిలో, ఎక్కువ గంటలు కూర్చుని పని చేసే వారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం అంత మంచిది కాదని వీలైనంత త్వరగా చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి బయట పడాలని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గాలన్నా అలాగే ఈ సమస్య భవిష్యత్తుల్లో రాకుండా ఉండాలన్నా కొన్ని నియమాలను పాటించాలని వారు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్య మన దరి చేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆటలు ఎక్కువగా ఆడాలి. శరీరానికి తగినంత శ్రమ ఉండేలా చూసుకోవాలి. అలాగే చక్కటి ఆహరాన్ని తీసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలను అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు, నూనెలో వేయించిన పదార్థాలకు, బేకరీ ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే మాంసాహారాన్ని కూడా తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానివేయడం మంచిది. ఈ విధంగా చక్కటి ఆహారాలను తీసుకుంటూ చక్కటి జీవన విధానాన్ని పాటించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.