Makkatlu : మనం మొక్కజొన్న కంకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మొక్కజొన్న కంకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా లభించే ఈ మొక్కజొన్న కంకులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మొక్కజొన్న కంకులను ఉడికించి, గింజలను వేయించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటితో గారెలను కడా తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ఇవే కాకుండా మొక్కజొన్న కంకులతో మక్కట్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు. మక్కట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని పాలాంబరంతో తింటే మరింత రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మక్కట్లను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే మక్కట్లను, పాలాంబరాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మక్కట్లు తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్న కంకులు – 2, నీళ్లు – కొద్దిగా.
పాలాంబరం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం- పావు కప్పు, యాలకులు – 3, నీళ్లు – ఒకటిన్నర కప్పు, బెల్లం – తగినంత, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు.
మక్కట్లు తయారీ విధానం..
ముందుగా మొక్కజొన్న గింజలను తీసుకుని జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు పాలాంబరం తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దీని కోసం నానబెట్టిన బియాన్ని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే యాలకులు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో బెల్లం వేసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న బియ్యంపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత పాలు పోసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల పాలాంబరం తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని గంటెతో తీసుకుని అట్టులాగా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి మరో అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మక్కట్లు తయారవుతాయి. వీటిని ముందుగా తయారు చేసుకున్న పాలాంబరంతో తింటే ఎంతో కమ్మగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు లేదా అల్పాహారంగా ఇలా మక్కట్లను తయారు చేసుకుని తినవచ్చు.