business ideas

ఆధార్ సెంటర్‌ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

ఆధార్ కార్డ్.. మన దేశ ప్రజలందరికీ ఈ కార్డు చాలా అవసరం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనే ప్రభుత్వ రంగ సంస్థ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఇది కేవలం ఐడీ ప్రూఫ్ గానే కాకుండా.. పలు ప్రభుత్వ పథకాలకు కూడా పనికొస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే దాదాపుగా అనేక మంది ఆధార్ తీసుకున్నారు. అయితే కొత్తగా ఆధార్ తీసుకోవాలన్నా లేదా ఇప్పటికే ఉన్న కార్డుల్లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా.. మనం కచ్చితంగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే సదరు ఆధార్ సెంటర్లు యూఐడీఏఐ నిబంధనల మేరకు నడుచుకుంటాయి.

అయితే తమ ప్రాంతంలో ఆధార్ సేవలను అందించేందుకు ఎవరైనా సెంటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు రిజిస్ట్రార్లు అనుమతినిస్తుంటారు. ఇక మన దేశంలో ఉన్న ఏ పౌరుడైనా సరే.. తమ ప్రాంతంలో ఆధార్ సెంటర్‌ను నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలా అంటే..

how to open aadhar center business

ఆధార్ కార్డు సెంటర్ ప్రాంచైజీ పొందాలనుకునే వారు యూఐడీఏఐ నిర్వహించే సూపర్‌వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేషన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ పాస్ కావల్సి ఉంటుంది. అలాగే ఈ పరీక్ష పాసైన వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) రిజిస్ట్రేషన్ పొందాలి. సీఎస్‌సీ రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీంతో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ చేయడానికి, ఆధార్ సెంటర్ ఏర్పాటుకు అభ్యర్థులకు ఆథరైజేషన్ లభిస్తుంది. ఆ తరువాత అభ్యర్థులు తమ ప్రాంతంలో ఆధార్ సెంటర్‌ను ఓపెన్ చేయవచ్చు.

ఇక సీఎస్‌సీ రిజిస్ట్రేషన్ కోసం సీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.csc.gov.in/ ను ఓపెన్ చేసి అందులో ఉండే Interested to become a CSC అనే లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే సీఎస్‌సీ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్‌ను కూడా రిజిస్ట్రేషన్ ఫాంలో ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేశాక ఆధార్ ఫ్రాంచైజ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసేందుకు ఆఫీస్ గది కావల్సి ఉంటుంది. సొంత గది అయినా ఫరవాలేదు. ఇక కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, పవర్ స్టాండ్‌బై ఉండాలి. ఈ క్రమంలో ఆధార్ కార్డు సెంటర్‌ను నిర్వహించే వారికి ఒక ఆధార్ కార్డుపై రూ.35 వరకు ఆదాయం లభిస్తుంది.

Admin

Recent Posts