Hyderabadi Special Boiled Egg Fry : మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. ప్రతిరోజూ కోడిగుడ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కంటిని చూపును మెరుగుపరచడంతోపాటు కంటిలో పొరలు రాకుండా చేయడంలోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం కోడిగుడ్లతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని ఉడికించి నేరుగా కూడా తింటుంటారు. ఉడికించిన కోడిగుడ్లను తినడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఉడికించిన కోడిగుడ్లతోనూ మనం వంటలను తయారు చేయవచ్చు. కోడిగుడ్లను ఉడికించి చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఉడికించిన ఎగ్స్ తో హైదరాబాదీ స్పెషల్ ఎగ్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ స్పెషల్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన ఎగ్స్ – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – ఒకటిన్నర కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 4, పసుపు – చిటికెడు, కారం – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
హైదరాబాదీ స్పెషల్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఉడికించిన ఎగ్స్ ను కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించిన తరువాత పచ్చి మిర్చి, ఉల్లిపాయలను, అర టీ స్పూన్ ఉప్పును వేసి కలిపి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు ముక్కలుగా చేసిన ఎగ్స్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉంచి, చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయి.