Uttareni : ఉత్తరేణి మొక్క… ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సంజీవని మొక్క అని చెప్పవచ్చు. మన చుట్టు పక్కల ఈ మొక్క ఉన్నప్పటికీ దీనిని మనం పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం. ఆయుర్వేద గ్రంథాలలో ఈ మొక్క గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. దీని ఉపయోగాలు తెలియక మనం ఎంతో నష్టపోతున్నాం. ఈ మొక్క సమూల రసం చేదుగా ఉంటుంది. మనకు వచ్చే వాత, కఫ, పిత్త సంబంధిత సమస్యలను సమూలంగా నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని సంస్కృతంలో అపమార్క, మయూరక, కరమంజరి అని అంటారు. ఉత్తరేణి గింజలను తీసుకుని పొడిగా చేయాలి. ఈ పొడిని 100 గ్రా. చొప్పున తీసుకుని దీనికి 10 గ్రా. ల ఉప్పును కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. తెల్లగా మారుతాయి. పిప్పి పళ్ల సమస్య కూడా తగ్గుతుంది.
ఉత్తరేణి ఆకుల పొడి లేదా వేరు పొడిని నిప్పుల మీద వేసి వచ్చే పొగను పీల్చడం వల్ల దగ్గు, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉత్తరేణి మొక్క మొత్తాన్ని తీసుకుని ఎండబెట్టి కాల్చి బూడిదగా చేయాలి.ఈ బూడిదకు రెట్టింపు చక్కెరను కలిపి రెండు పూటలా 3 గ్రా. ల చొప్పున తీసుకుంటూ ఉండడం వల్ల గొంతులో, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. ఆయాసం, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఉత్తరేణి మొక్క పచ్చి గింజలను నూరి వడకట్టి ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటుండడం వల్ల మూత్రాశయంలో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఉత్తరేణి మొక్క పచ్చి ఆకులు ఏడింటిని తీసుకుని వీటికి ఏడు మిరియాలను కలిపి నూరి తీసుకోవడం వల్ల సుఖ ప్రసవం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరేణి ఆకులను, మిరియాలను, వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి నూరి చిన్న మాత్రల పరిమాణంలో చేసి నీడకు ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు పూటకు రెండు చొప్పున ఈ మాత్రలను తీసుకుంటూ ఉండడం వల్ల జ్వరం తగ్గుతుంది.
ఎర్ర ఉత్తరేణి ఆకుల రసాన్ని 50 గ్రా.ల చొప్పున తీసుకుని దానికి 50 గ్రా.ల ఆవు నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల రక్త మొలల సమస్య తగ్గుతుంది. ఉత్తరేణి ఆకులు, సహాదేవి చెట్టు వేరు, మిరియాలను సమపాళ్లల్లో కలిపి నూరి మిరియాల గింజలంత పరిమాణంలో మాత్రలుగా చేసి నీడకు ఎండబెట్టి తల్లిపాలతో కలిపి పిల్లలకు నాకిస్తూ ఉండడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
ఉత్తరేణి వేరు, నేలతాడి దుంప, పిప్పిళ్లను 50 గ్రా. ల చొప్పున తీసుకుని సమపాళ్లలో బెల్లాన్ని కలిపి పూటకు పది గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండడం వల్ల బోద కాలు, బోద చేతులు, బోద జ్వరాలు తగ్గుతాయి. ఉత్తరేణి మొక్క వేరు ముద్దను ఆవు మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల పాండు రోగం తగ్గుతుంది. అంతే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.
స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్క ఆకులను, వేర్లను సమపాళ్లలో తీసుకుని పొడిగా చేయాలి. ఈ పొడికి సమపాళ్లల్లో పటిక బెల్లం పొడిని కలిపి పూటకు 10 గ్రా.ల చొప్పున తీసుకుంటూ ఉండడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గుతాయి. నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. కాలేయం, ప్లీహం కూడా శుభ్రంగా మారుతాయి. శరీరంలో మంచి రక్తం పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా ఈ మొక్కను ఉపయోగించి మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.