Idli Manchurian : ఉదయం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీలను చట్నీ, సాంబార్, కారం పొడి వంటి వాటితో తింటుంటారు. ఇలా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇడ్లీలను మనం కొన్ని సార్లు అవసరం అయిన దాని కన్నా ఎక్కువగానే చేస్తుంటాం. దీంతో అవి మిగిలిపోతుంటాయి. వాటిని తరువాత తినలేరు. ఈ క్రమంలో చేసేదేం లేక మిగిలిపోయిన ఇడ్లీలను పడేస్తుంటారు. అయితే ఇకపై వాటిని అలా పడేయకండి. వాటితో ఎంతో రుచికరమైన మంచూరియాను చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. ఇడ్లీలతో మంచూరియాను ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 4, సన్నగా తురిమిన క్యాబేజీ – 1 కప్పు, ఉల్లిపాయ, ఉల్లికాడలు, క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు చొప్పున, మిరియాల పొడి – పావు టీస్పూన్, సన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి ముక్కలు – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, చిల్లీ సాస్, టమాటా సాస్ – 1 టేబుల్ స్పూన్, సోయాసాస్ – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత.
ఇడ్లీ మంచూరియాను తయారు చేసే విధానం..
ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసి వీటిని వేసి రెండు వైపులా ఎర్రగా వేయించి తీయాలి. ఇదే కడాయిలో వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయాలి. తరువాత ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యాబేజీ తురుము వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత సోయా, చిల్లీ, టమాటా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేయాలి. ఇప్పుడు కార్న్ ఫ్‌లోర్‌లో కొన్ని నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని కడాయిలో వేయాలి. అవసరం అయితే ఇంకొన్ని నీళ్లు పోయాలి. 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. తరువాత ఇడ్లీ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేయాలి. ఈ ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలపాలి. కాసేపు అలాగే ఉంచి దించేయాలి. దీంతో ఎంతో రుచికరమైన ఇడ్లీ మంచూరియా రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు.