Trees : మనం మన ఇంటి ఆవరణలో అనేక రకాల మొక్కలను పెంచుతూ ఉంటాం. సువాసన కలిగి పువ్వులు పూసే ప్రతి మొక్కను కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. కానీ అన్ని రకాల మొక్కలను మన ఇంటి ఆవరణలో పెంచుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని రకాల మొక్కలను మన ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు. కానీ మనకు తెలియక ఆ మొక్కలను కూడా మన ఇంటి ఆవరణలో పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి ఆవరణలో పెంచకూడని మొక్కలను పెంచుకోవడం వల్ల మనం ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి శుభం కలుగుతందని మనం తులసి, మనీ ప్లాంట్ వంటి మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. కానీ ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ ఎదుగుతున్న మొక్కలను పెంచుకోవడం వల్ల అనుకూలత, వ్యతిరేక శక్తుల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది.
వాస్తుకు అనుకూలంగా ఇంటిని ఉంచుకోవాలంటే మాత్రం ఈ చిట్కాలను పాటించాలి. ఇంటి ఆవరణలో నాగజెముడు, బ్రహ్మ జెముడు వంటి మొక్కలను పెంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు మొక్కలను, బొన్సాయి మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు. ఇలాంటి మొక్కలను ఖాళీ ప్రదేశంలో, తోటలలో పెంచుకోవాలి. చింత చెట్టును, గోరింట చెట్టును ఆత్మలకు నివాసంగా చాలా భావిస్తూ ఉంటారు. కనుక ఈ మొక్కలను పెంచుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించడం చాలా అవసరం. ఈ మొక్కలను ఇంటికి దూరంగా లేదా అసలు పెంచుకోకపోవడమే చాలా మంచిది.
ఎండిపోయిన, జీవం కోల్పోయిన చెట్లను ఇంట్లో ఉంచుకోకూడదు. వీటిని తొలగించకుండా ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ పచ్చని మొక్కలనే ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ లభించడమే కాకుండా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వాడిపోయిన పువ్వులను ఇంట్లో ఉంచుకోవడం అంటే మనం దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడమే అని శాస్త్రం చెబుతోంది. అలాగే తుమ్మ చెట్టును కూడా ఇంటి ఆవరణలో ఉంచుకోకూడదు. ఇంటి ఆవరణలో తుమ్మ చెట్టు ఉండడం వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి. అదే విధంగా పత్తి, తాటి చెట్లను కూడా ఇంటి ఆవరణలో ఉంచుకోకూడదు. కుండీలలో పెంచుకునే మొక్కలను ఇంటి ముందు తూర్పు దిక్కున ఉన్న గోడపై ఉంచకూడదు. తూర్పు, ఈశాన్యంలో పొడవైన చెట్లు ఉండడం వల్ల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.