Shani Dosham : సాధారణంగా చాలా మంది జాతక దోషంలో శని గ్రహ ప్రభావం దోషం ఉండటం వల్ల వారు ఏ పనులు చేపట్టినా ముందుకు సాగవు. అదేవిధంగా ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇలా శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఆలయంలో నవగ్రహాల పూజ చేయించడం, శని గ్రహదోష పరిహారం చేయించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే మన దేశంలో పలు చోట్ల శనీశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది.. పావగడ శనీశ్వరాలయం.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి పావగడలో వెలసిన శనీశ్వరాలయం ఎంతో మహిమ గల ఆలయం అని చెప్పవచ్చు. శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్లి స్వామి వారిని పూజించడం వల్ల వారిపై శని ప్రభావ దోషం తొలగిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి మొక్కులు చెల్లించి, తమపై శని ప్రభావం దోషం ఉండకుండా పరిహారాలు చేయించడంతో శని ప్రభావం తొలగిపోతుందని చెబుతారు.
ఈ శనీశ్వరాలయంలో ప్రజలు ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అమ్మవారికి పూజలు చేసేవారు. ఇలా అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఆ ప్రాంతమంతా ఏ విధమైనటువంటి కరువుకాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉందని, అమ్మవారి విగ్రహానికి ఆలయం నిర్మించి పూజలు చేసేవారు. ఈ క్రమంలోనే ఆలయంలో శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించి శనీశ్వరుడి విగ్రహం ప్రతిష్టించారు. అప్పటి నుంచీ ఈ ఆలయం శనీశ్వరాలయంగా పేరుగాంచింది. ఈ ఆలయానికి కర్ణాటక వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామివారికి తలనీలాలు, నిలువు దోపిడీ చెల్లించడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల తమపై ఉన్న శని దోషం తొలగిపోతుందని విశ్వసిస్తుంటారు.