India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. దంచేసిన బ్యాట్స్‌మెన్‌..!

India Vs Sri Lanka : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్ లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక త‌డ‌బ‌డింది. వ‌రుస‌గా వికెట్లను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. దీంతో శ్రీ‌లంక ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై భార‌త్ 62 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

India Vs Sri Lanka India won by 62 runs against Sri Lanka in 1st T20
India Vs Sri Lanka

మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో ఇషాన్ కిష‌న్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌లు అర్ధ సెంచ‌రీల‌తో చెల‌రేగిపోయారు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో కిష‌న్ 89 ప‌రుగులు చేయ‌గా.. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో అయ్య‌ర్ 57 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 44 ప‌రుగులు చేశాడు. ఇక శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో లాహిరు కుమార‌, ద‌సున్ శ‌న‌క‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయి 137 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో చ‌రిత్ అస‌లంక మిన‌హా ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయలేదు. 47 బంతుల్లో 5 ఫోర్ల‌తో చ‌రిత్ 53 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, వెంక‌టేష్ అయ్య‌ర్‌లు చెరో 2 వికెట్లు తీయ‌గా.. య‌జువేంద్ర చాహ‌ల్‌, ర‌వీంద్ర జ‌డేజాలు చెరొక వికెట్ తీశారు.

కాగా ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో భార‌త్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 26వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గనుంది.

Share
Editor

Recent Posts