India Vs Sri Lanka : మొహాలి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా ప్రయాణం చేస్తోంది. రిషబ్ పంత్ సెంచరీని మిస్ చేసుకోగా.. కోహ్లికి ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కోహ్లిని సన్మానించింది. అందుకు ఆయన భార్య అనుష్క శర్మ కూడా హాజరైంది.
భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అందులో 4 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అలాగే హనుమ విహారి 128 బంతుల్లో 58 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేయగా.. టెస్టుల్లో కోహ్లికి 8000 పరుగులు పూర్తయ్యాయి. అలాగే రవీంద్ర జడేజా 82 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కొనసాగుతున్నాడు. క్రీజులో జడేజాతోపాటు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. 11 బంతులో అశ్విన్ 2 ఫోర్లతో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కొనసాగుతున్నాడు.
కాగా శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్‌దెనియా 2 వికెట్లు తీయగా.. సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండొ, లాహిరు కుమార, ధనంజయ డిసిల్వలకు తలా 1 వికెట్ దక్కింది.