Instant Ragi Dosa : ఇన్ స్టాంట్ రాగి దోశ.. రాగిపిండితో చేసే ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే ఈ దోశను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా రాగిదోశను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ దోశను మనం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చట్నీతో తింటే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి దోశను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – అర కప్పు, రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ.
ఇన్ స్టాంట్ రాగి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి, రవ్వ, ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మరో కప్పున్నర నీళ్లు పోసి కలిపి పక్కకు ఉంచాలి. దీనిని 10 నిమిషాల పాటు నానబెట్టిన తరువాత ఇందులో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత దీనిపై క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత పిండిని తీసుకుని రవ్వ దోశ మాదిరి దోశ వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. ఈ దోశను చక్కగా కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దోశ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.