Meal Maker Chikkudu Kaya Masala Kura : మీల్ మేకర్ చిక్కుడుకాయ మసాలా కర్రీ.. పేరు చూడగానే ఈ కూర అర్థమైపోయి ఉంటుంది. మీల్ మేకర్, చిక్కుడు కాయలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మసాలా కూరతో కడుపు నిండుగా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తేలికగా ఈకూరను ఎవరైనా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే మీల్ మేకర్ చిక్కుడుకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – అర కప్పు, చిక్కుడుకాయలు – అరకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటాలు – 2, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 2, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్.
మీల్ మేకర్ చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా వేడి నీటిలో మీల్ మేకర్ లను వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మాడిపోకుండా దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి.
తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత మీల్ మేకర్, చిక్కుడు కాయలు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై చిక్కుడు కాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చిక్కుడుకాయలు ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.