Jonna Janthikalu : మనం జొన్నలతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో చేసే వంటకాలు తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నలను పిండిగా, రవ్వగా చేసి రకరకాల వంటకాలను చేస్తూ ఉంటాము. జొన్నపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో జంతికలు కూడా ఒకటి. జొన్నపిండితో చేసే ఈ జంతికలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న జంతికల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నపిండి – 2 కప్పులు, బియ్యం పిండి – ఒక కప్పు, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావువు టీ స్పూన్, గోరు వెచ్చని నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
జొన్న జంతికల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండితో పాటు మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ జంతికల పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసి పిండిని ఉంచాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికలను వత్తుకుని కాల్చుకోవాలి. ఈ జంతికలను మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న జంతికలు తయారవుతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇలా జొన్నపిండితో రుచికరమైన జంతికలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.