KA Paul : తన మాటలు, హావ భావాలతో ఆకట్టుకునే శాంతి ప్రబోధకుడు డాక్టర్ కేఏ పాల్ మరోమారు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తాజా పరిస్థితులపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. యుద్ధం ఆపేందుకు తాను గత కొద్ది రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నానని అన్నారు. గత 21 రోజుల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తాను విజ్ఞప్తి చేస్తున్నానని.. యుద్ధం చేసే ఆలోచనను విరమించుకోవాలని ఆయనకు సూచించానని తెలిపారు.
కాగా పుతిన్‌ను పాల్ మెంటలోడు అని సంబోధించారు. గత నెలలో తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడానని.. మిలిటరీని ఉక్రెయిన్‌కు పంపి ఉంటే రష్యా ఇప్పుడు యుద్ధం చేసేది కాదని అన్నారు. కానీ బైడెన్ తన సలహాను పాటించలేదన్నారు. ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపలేదన్నారు. రష్యా.. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే.. అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తుందని అన్నారు. బైడెన్ అసలు తన మాటలను వినడం లేదని అన్నారు.
కాగా గతంలోనూ కేఏ పాల్ పలు సందర్భాలలో ఇలాగే మాట్లాడారు. అయితే ఆయన మాటల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై జోకులు పేలుస్తుంటారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. తాను ట్రంప్ కోసం ప్రచారం చేశానని.. అందుకనే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని కూడా పాల్ అన్నారు.
కాగా తాను ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేస్తున్నానని.. అందులో భాగంగానే అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులకు లేఖలు కూడా రాశానని పాల్ తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే తాను అనేక దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నానని అన్నారు. ఈ క్రమంలోనే పాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.