Kakarakaya Kura : కాకరకాయలతో కూర అనగానే చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మంది వీటిని తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కాకరకాయలతో మనం పులుసు, వేపుడు, టమాటా కర్రీ వంటివి చేస్తుంటాం. అయితే చేదు లేకుండా ఉంటేనే వీటిని తింటారు. పైగా కారం కూడా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. చేదు తగ్గుతుంది. ఈ క్రమంలో కాస్త కారం జోడించి చేదు లేకుండా కాకర కాయ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఇందుకు కావల్సిన పదార్థాల గురించి కూడా ఒక్కసారి చూద్దాం.
కాకరకాయలు – 4, నూనె – పావు కప్పు, పుల్లని మజ్జిగ – కప్పు, పసుపు – అర టీస్పూన్, ఉల్లిపాయలు – 2, వెల్లుల్లి రెబ్బలు – 10, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ఉప్పు – తగినంత, కరివేపాకు రెబ్బలు – 2, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు.
కాకరకాయలను చక్రాలుగా కోసి గింజలు తీసేయాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి కాకరకాయ ముక్కలు, మజ్జిగ, పసుపు, పావు టీస్పూన్ ఉప్పు వేసి ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, తగినంత ఉప్పును మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక కాకరకాయ ముక్కల్ని వేసి వేయించుకుని 5 నిమిషాలు అయ్యాక ఉల్లి మసాలా, కరివేపాకు వేసి బాగా కలపాలి. కూరను దింపేముందు కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇలా చేసిన కాకరకాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు సైతం దీన్ని లాగించేస్తారు.